మోడీ మాస్టర్‌ స్ట్రోక్‌… జగన్‌ బృందం విలవిల

గల్ఫ్‌ బ్యాంకుల నుంచి వేల కోట్లలో రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన భారతీయుల పని పట్టేందుకు యూఏఈ బ్యాంకులకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాదాపు రూ. 50,000 కోట్లకు పైగా రుణాలు తీసుకుని యూఏఈ నుంచి పారిపోయి వచ్చిన భారతీయులతో పాటు యూఏఈ బ్యాంకుల నుంచి కార్పొరేట్‌ రుణాలు తీసుకున్నవారిపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ అనుమతించింది. భారత ప్రభుత్వం నిర్ణయంతో డిఫాల్టర్ల పని పట్టేందుకు యూఏఈ బ్యాంకులు రెడీ అవుతున్నాయి. ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ, మష్రీక్‌ బ్యాంక్‌, అబుదబి కమర్షియల్‌ బ్యాంక్‌, దోహా బ్యాంక్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రాయిన్‌తో పాటు మరికొన్ని బ్యాంకులు… దుబాయి, బహ్రయిన్‌లోని తమ శాఖల ద్వారా భారతీయులకు/భారత కంపెనీలకు రుణాలు ఇచ్చాయి. రూ. 50,000 కోట్లలో 75 శాతం రుణాలు కార్పొరేట్‌ రుణాలే. మోడీ నిర్ణయంతో ఎమిరేట్స్‌తో లావాదేవీలు జరిపిన అనేక వ్యాపారవేత్తలు ఇపుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. భారతదేశంలో అమలయ్యేలా యూఏఈ కోర్టులకు చెందిన తీర్పులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ జనవరి 17వ తేదీన భారత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీని ప్రకారం భారత కోర్టుల తీర్పులను ఎలా అమలు చేస్తున్నామో…అలాగే డీఫాల్టర్ల విషయంలో యూఏఈ కోర్టుల తీర్పులను ఇక్కడ అమలు చేయాల్సి ఉంటుంది.

ఎమిరేట్స్‌ ఒత్తిడి…

ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్నవారిలో చాలా మందికి ఎమిరేట్స్‌ బ్యాంకులతో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్‌, ఇందూ గ్రూప్‌, పెన్నా సిమెంట్స్‌తో పాటు ఇంకా అనేక మంది యూఏఈ బ్యాంకులతో లావాదేవీలు జరిపారు. కొందరు రుణాలు కూడా తీసుకున్నారు. వీరిలో డీఫాల్ట్‌ అయిన వారి జాబితా ఇంకా వెల్లడి కావల్సి ఉంది.

రస్‌ అల్ ఖైమా…

ఎమిరేట్స్‌ తమ బకాయిలు వసూలుకు ప్రయ్నతాలు మొదలు పెట్టాయి. బ్యాంకులతో పాటు ఎమిరేట్స్‌కు చెందిన ఫండ్స్‌ కూడా ఇందులో ఉన్నాయి. చాలా వరకు ఎమిరేట్ ఫండ్స్‌ తాము కొంత ఈక్విటీగా పెట్టి… మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణం తీసుకుని విదేశాల్లో పెట్టుబడిగా పెట్టాయి. వాన్‌పిక్‌ ప్రాజెక్టులో రస్‌ అల్‌ ఖైమా కూడా ఇదే తరహా పెట్టుబడి పెట్టింది. వాన్‌పిక్‌ పెట్టుబడి తిరిగి రాబట్టుకునేందుకు ఇప్పటికే భారత ప్రభుత్వంపై రస్‌ అల్‌ ఖైమా అంతర్జాతీయ కోర్టులో కేసు వేసింది. అయితే భారత ప్రభుత్వానికి ఇక్కడ ఒక సానుకూల అంశముంది. అదేమిటంటే రస్‌ అల్‌ ఖైమా పెట్టుబడి రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా వచ్చింది. అయితే ఈ ‘రాక్‌’కు పెద్దలుగా ఉన్నవారందరూ నిమ్మగడ్డతో కుమ్మక్కు అయ్యారని… కోట్ల రూపాయలను దారి మళ్ళించి భారత్‌కు తీసుకు వచ్చారని సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది.

రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ పెద్దలు’…

వాన్‌ పిక్‌ కోసం భారత్‌కు వచ్చి… ఇందూటెక్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన విషయాన్నీ సీబీఐ పేర్కొంది. సరిగ్గా ఇదే సమయంలో తమ కంపెనీ నిర్వహకులే..తమను మోసం చేశారని రస్‌ అల్‌ ఖైమా కూడా బ్రిటన్‌తో సహా అనేక దేశాల్లో కేసు పెట్టింది. వెరశి… రస్‌ అల్‌ ఖైమాను వారి కంపెనీ పెద్దలే, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలతో ముంచేశారని రుజువైంది. దీంతో ఇపుడు రస్‌ అల్ ఖైమా నేరుగా రంగంలోకి దిగింది. తన సొమ్ము రాబట్టుకునేందుకు రెడీ అయింది.

నిమ్మగడ్డ అరెస్ట్‌ అందుకే…

రస్‌ అల్‌ ఖైమా విజ్ఞప్తి మేరకు సెర్బియా అధికారులు నిమ్మగడ్డ ప్రసాద్‌ను గత ఏడాది అరెస్ట్‌ చేశారు. అక్కడే అతన్ని ఇంటరాగేట్‌ చేస్తున్నారు. భారత్‌లో ఫుట్‌బాల్‌ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు నిమ్మగడ్డ కేరళ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఫుట్‌బాల్‌ ఆటగాళ్ళ కోసమే సెర్బియాకు వెళ్ళినపుడు అక్కడ అరెస్ట్‌ అయ్యారు. సెర్బియా, రస్‌ అల్‌ ఖైమా మధ్య దౌత్య సంబంధాలు బాగుండటంతో… భారత్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైగా నిమ్మగడ్డపై ఇప్పటికే కేసులు ఉన్నాయి. దీంతో నిమ్మగడ్డను కాపాడటం భారత ప్రభుత్వానికి సులువైన వ్యవహారంలో కన్పించడం లేదు. దీనికి రస్‌ అల్‌ ఖైమా చెబుతున్న పరిష్కారం… తమ సొమ్ము తమకు వెనక్కి ఇప్పించమని.

అంతిమ లబ్దిదారుడు ఎవరు?

నిమ్మగడ్డకు సంబంధించి రాజకీయ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన అప్రూవర్‌గా మారారని కొందరు అంటున్నారు. అయితే నిమ్మగడ్డతో సంబంధం లేకుండా… తమ సొమ్ము అంతిమంగా ఎవరికి చేరిందో వారి నుంచి ఇప్పించమని రస్‌ అల్‌ ఖైమా బేరం పెట్టినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. సొమ్ము తాను పెట్టినా… కంపెనీలపై తనకు అజమాయిషీ లేదని నిమ్మగడ్డ చేతులు ఎత్తేయడంతో వ్యవహారం ఇపుడు కేంద్రం వరకు వచ్చినట్లు సమాచారం. తమ సొమ్ము ఎవరికి చేరిందో వారిపై యూఏఈ కోర్టుల నుంచి డిక్రీ తెస్తామని, వారి అరెస్ట్‌కు అంగీకరిస్తారా అని ఢిల్లీని రస్‌ అల్‌ ఖైమా కోరినట్లు సమాచారం. అంటే ఈ వ్యవహారం… జగన్‌ వరకు వచ్చి ఆగిందన్నమాట.

కోర్టులో కేసు…

వాన్‌పిక్‌ కేసు ఇపుడు సీబీఐ కోర్టులో ఉంది. ఇంకా విచారణే ప్రారంభం కాని ఈ కేసు నిందితులపై యూఏఈ కోర్టులు డిక్రీలు ఇస్తే ఎలా? అన్న చర్చ ఇపుడు ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. యూఏఈ కోర్టు తీర్పులను అమలుకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం … ఈ ఒక్క కేసుకు మినహాయింపు ఇస్తుందా? ఇక్కడ కేంద్రానికి ఒక వెసులుబాటు ఉంది. అంతర్జాతీయ కోర్టులో కేసు ఉంది కాబట్టి… దీన్ని పక్కన పెట్టొచ్చు. లేదా బ్యాంకులు కాకుండా… ఏకంగా రస్‌ అల్‌ ఖైమా ప్రభుత్వమే పెట్టుబడి పెట్టింది కాబట్టి… ఈకేసును ప్రత్యేకంగా చూడొచ్చు. గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ డీల్‌ కాబట్టి. మరి రస్‌ అల్‌ ఖైమా వ్యవహారం జగన్‌ మెడకు చుట్టకుంటుందా లేదా మోడీ కాపాడుతారా చూడాలి మరి?

Related Articles