జగన్‌ కమీషన్ల బ్రోకరా? మరి సీబీఐ చార్జిషీటు ‘ముచ్చట’ ఏమిటి?

మీడియాలో గుత్తాధిపత్యం చెలాయించే సంస్థలపై ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు అనేక కథనాలు రాస్తుంటారు. మీడియా మరో మాఫియాలా మారకుండా ఉండేందుకు. జర్నలిస్టులు సొంతంగా నడుపుకునే న్యూస్‌ పోర్టల్స్‌, యాప్స్‌పై సాటి జర్నలిస్టులే దాడి చేయడం తెలుగులో కొత్తగా వస్తున్న ధోరణి. పార్టీలు, కులాలు, ప్రాంతాలు అంటగట్టడం, రాసిన కథనంలో పసలేదని, క్రెడిబిలిటీ లేదని ఎద్దేవా చేయడం కొత్త ట్రెండ్‌. ఇలాంటి అనుభవమే… ఇంకా పురుడుపోసుకోని ‘చిట్టిన్యూస్‌’కు ఎదురైంది. (చిట్టిన్యూస్‌ యాప్‌ ఇంకా బేటా వెర్షన్‌లోనే నడుస్తోంది). ఎమిరేట్స్‌ నుంచి నిధులు తెచ్చుకుని ఎగ్గొట్టిన కంపెనీలకు సంబంధించి…ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం తాలూకు వార్త గల్ఫ్ న్యూస్‌, ఎకనామిక్‌టైమ్స్‌ పత్రికల్లో వచ్చింది. మోడీ నిర్ణయం వల్ల జగన్‌కేసుపై పడే ప్రభావం… జగన్‌, మోడీ ఎదుట ఉన్న మార్గాల గురించి చిట్టిన్యూస్‌ కథనం రాసింది. నాలుగు రోజుల శ్రమ. ఎంత దౌర్భాగ్యమంటే… కనీసం క్రెడిట్‌ లైన్‌ ఇవ్వకుండా మొత్తం వార్తను వాడేసుకుని… ‘ముచ్చట’గా ముందు ఒక పేరా, చివర ఒక పేరాతో తన పని కానిచ్చేసింది ముచ్చట వెబ్‌సైట్‌. తొలి పేరా మొత్తం ఒక పార్టీకి యాప్‌ను అంటగట్టడానికి కేటాయిస్తే… చివరి పేరాలో… ‘ఇందులో చాలా నిజాలున్నాయి… అంటూనే చంద్రబాబు అక్రమార్జన వార్తల్ని డైవర్ట్‌ చేయడం వరకూ ఓకే.. కాని ఇంకాస్త కాంక్రీట్‌గా బిల్డప్‌ చేస్తే రక్తికట్టేదేమో…’ అన్న అనుమానం కూడా వ్యక్తం చేసింది ‘ముచ్చట’.
ఈ కథనంలోప్రధాన లోపం ఏమిటంటే.. వాన్‌పిక్‌ కేసులో అంతిమ లబ్దిదారుడు ఎవరు? సీబీఐ కూడా క్విడ్‌ ప్రొ కో జరిగిందీ, జగన్‌కు భారీగా కమిషన్లు తీసుకున్నాడు అని చెప్పిందే తప్ప…అంటూ జగన్‌ ఓ బడా కమీషన్‌ బ్రోకర్‌ అని మాత్రమే సర్టిఫై చేసింది ముచ్చట.
ఈ రెండు వార్తలు చదివాక.. కొంత మంది జర్నలిస్టు మిత్రులు… ఇంతకీ జగన్‌ అంతిమ లబ్దిదారుడా? కమీషన్‌ బ్రోకరా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. ‘మా అనుమానం తీర్చితే… స్టోరీ కాంక్రీట్‌గా ఉంటుంద’ని ముచ్చట పడ్డారు. వారి ముచ్చట కోసం డాక్యుమెంట్లు ఎందుకు బయటపెట్టడం అనిపించింది. స్టోరీ కాంక్రీట్‌గా లేదని బాధపడుతున్న ‘ముచ్చట’ తీర్చడం కోసమైనా రాయడం మంచిదేగా!
పాఠకులను బోర్‌ కొట్టకుండా… కేవలం రస్‌ అల్‌ ఖైమా నుంచి వచ్చిన నిధులు అంతిమంగా ఎక్కడికి వెళ్ళాయో… అంతవరకే ఈ స్టోరీని పరిమితం చేస్తున్నాం.
…….

రాక్‌, నిమ్మగడ్డ అనుబంధం ఇందూ ప్రాజెక్ట్స్‌ నుంచే ప్రారంభమైంది. వాన్‌పిక్‌ ప్రాజెక్టుకు బీజం పడింది ఆ కంపెనీలోనే. ఇందూ ప్రాజెక్ట్‌లో డైరెక్టర్లుగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌, రస్‌ అల్‌ ఖైమా ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న ఏజే జగన్నాథన్‌…వాన్‌పిక్‌కు రూపకల్పన చేశారు. 2008 ఫిబ్రవరి 12న ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ ప్రాజెక్టు కింద వాన్‌పిక్‌ను చేపడదామని. సరిగ్గా నెల తరవాత అంటే మార్చి 11న వాన్‌పిక్‌పై ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం కుదుర్చుకున్నతరవాత 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఓకే చేశారు. అప్పటికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలుపలేదు. జీవో కూడా విడుదల కాలేదు. అదే నెల 28వ తేదీన రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (రాకియా) నుంచి వాన్‌పిక్‌లో రస్‌ అల్‌ ఖైమా వాటా తీసుకుంటుందని ఆ కంపెనీ సీఈఓ ఖతిర్‌ మసద్‌ లేఖ రాశారు. ఈయన పేరు గుర్తుంచకోండి చివర్లో మాట్లాడుకుందాం.

మారిషస్‌లో ఏం జరిగింది?


ఏపీలో ఇలా జరుగుతుండగా… మారిషస్‌లో ఏం జరిగిందో సీబీఐ బయటపెట్టింది. కుదిరిన ఒప్పందంపై తరవాత వైఎస్‌ సంతకం పెడితే… అసలు కేబినెట్‌, ప్రభుత్వ జీవో రాక ముందే రస్‌ అల్‌ ఖైమా నిధులు ఏపీకి తరలించేందుకు నిమ్మగడ్డ ప్రసాద్‌, ఆయన సోదరుడు ప్రకాష్‌.. మారిషస్‌లో మకాం వేశారు. ఏప్రిల్‌లోనే మారిషస్‌లో వోల్గా హోల్డింగ్స్‌ అనే షెల్‌ కంపెనీని తీసుకుని దాని పేరును రాక్‌ ఇన్‌ఫ్రా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌గా మార్చారు. అలాగే రాక్‌ విజన్‌ అనే కంపెనీని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని వందల కోట్లను ఈ రెండు కంపెనీల ద్వారా రాక్‌ ఏపీలో పెట్టుబడి పెట్టింది… విచిత్రమేమిటంటే రాక్‌ నిధులు తరలించే ఈ కంపెనీలకు రాక్‌ సంస్థల ప్రతినిధులకు కాకుండా…. ఆధీకృత సంతకందారుగా నిమ్మగడ్డ ప్రకాష్‌ పేరు ఉండటం. ప్రభుత్వం నుంచి వాన్‌పిక్‌కు ఇంకా అనుమతి పొందకుండానే ఈ తతంగమంతా మారిషస్‌లో పూర్తి కావడం.

వచ్చిన మొత్తం ఎంత?


వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ కోసం ఆటోమేటిక్‌ రూట్‌లో రాకియా ఏకంగా రూ. 536 కోట్లు పెట్టబడి పెట్టిందని సీబీఐ తేల్చింది. ఇంత భారీ మొత్తంలో గోరంత మొత్తం కూడా వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ అమలు కోసం వాడలేదని తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. రెండు దఫాలుగా రాకియా నుంచి రూ. 428.72 కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టబడుల కింద వచ్చాయని… ఆ మొత్తాన్ని అంతా నిమ్మగడ్డ ప్రసాద్‌… ఇతర కంపెనీలకు మళ్ళించాడని సీబీఐ స్పష్టం చేసింది.

సొంత కంపెనీల్లోకి…


రాకియా నుంచి వచ్చిన తొలి విడత మొత్తం రూ. 150.72 కోట్లను తన సొంత కంపెనీలకు ఆల్ఫా గ్రూప్‌ (ఇది కూడా నిమ్మగడ్డదే) ద్వారా మళ్ళించారని తెలిపింది. ఇక ఈ ఆల్ఫా గ్రూప్‌ కంపెనీలు పెట్టిన పెట్టుబడుల్లో చాలా వరకు జగన్‌ కంపెనీలకే వెళ్ళాయని సీబీఐ పేర్కొంది. ఇదే ఆల్ఫా గ్రూప్‌ మరో రూ. 278.72 కోట్లు పలు ఇతర కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసింది. అందులో కూడా మెజారిటీ కంపెనీలు జగన్‌ గ్రూప్‌కు చెందినవే.

వెరశి సీబీఐ ఏమంటోంది?


నిమ్మగడ్డ ప్రసాద్‌ వల్ల జగన్మోహన్‌ రెడ్డి రూ. 854.50 కోట్లు లబ్ది పొందారని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. ఇది అందరికీ తెలిసినదే. కాని ఇదే చార్జిషీటులో సీబీఐ తన చార్జిషీటులో పేర్కొన్న కీలక పేరా…
‘వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో చాలా భాగం నిధులు నిమ్మగడ్డ ప్రసాద్‌కు అప్పగించిందని…వాటిల్లో చాలా మొత్తాన్ని దుర్వినియోగం చేసి… జగన్మోహన్‌ రెడ్డికి చెందిన కంపెనీలకు దారి మళ్ళించారు.’
….
ఇది జగన్మోహన్‌ రెడ్డి కంపెనీల్లోకి రాక్‌ నిధుల ప్రవాహం గురించి సీబీఐ పేర్కొన్న వివరాలు. నిజంగానే జగన్‌కు కమీషన్ల రూపంలో వచ్చిందనుకుంటే… వందలు కోట్లు ఇస్తారా? ఈక్విటీల్లో పెట్టుబడి పెడతారా? కమిషన్‌ ఇచ్చేవాడు…తనకు వచ్చిన మొత్తం కొంత ఇస్తాడు. మరి కమిషన్‌ మాత్రమే తీసుకున్నవాడు కేసులో ఏ1 ఎలా అయ్యారు? ఏ2గా విజయసాయి రెడ్డి ఎలా నిలబడ్డారు? ఏ3గా నిమ్మగడ్డ ఎలా అవుతారు? అంటే వాన్‌పిక్‌ కుంభకోణంలో మెజారిటీ లబ్దిదారు ఏ1 కాబట్టి.


…..
సరే… ఇక్కడ సీబీఐ కేసు ఇంకా విచారణ కూడా ప్రారంభం కాలేదు. రాజకీయ ఒత్తిళ్ళ మేరకే జగన్మోహన్‌ రెడ్డిపై కేసు పెట్టారని అనుకుందాం. మరి రాక్‌ వైపు నుంచి స్టోరీ… సీబీఐ చార్జిషీటును ధృవపరిచేలా ఉంది కదా! ఇందాక ఆరంభంలో పేర్కొన్న ఖతీర్ మసద్‌… RAK ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (రాకియా) సీఈఓ. ఈయన ద్వారానే నిధులు విడుదల అవుతాయి. దాదాపు రూ.11,000 కోట్లు మోసం చేశాడని మసద్‌పై రస్‌ అల్‌ ఖైమా కేసు పెట్టింది. భారీ జరిమానాతో పాటు 15 ఏళ్ళ జైలు శిక్ష వేసింది కోర్డు.నిందితులు విదేశాలకు పారిపోవడంతో శిక్ష ఇంకా అమలు కాలేదు. ఇది జార్జియా కేసుకు సంబంధించినది. ఇపుడు ఇండియాలో మసద్‌ అక్రమాలపై రస్‌ అల్‌ ఖైమా దృష్టి సారించింది. కాబట్టి ఇక్కడ జరిగిన అక్రమాలు రుజువు కావడానికి మన కోర్టుల్లో చాలా సమయం పట్టవచ్చేమో గాని… రస్‌ అల్‌ ఖైమా కోర్టులో తొందరగానే కేసులు తేలిపోతాయి.


…..
సో… ఇపుడు పాఠకులకు రాకియా నిధులు ఏపీలో ఎక్కడికి వెళ్ళాయో ఈపాటికి అర్థమై ఉంటుంది. ఇంకా క్లారిటీ రావాలంటే… ఈసారి కేవలం రాకియా నిధులపై దర్యాప్తు మొదలవ్వాలి. అపుడు పైసాతో సహా లెక్క తేలుతుంది. ఇప్పటికైనా జగన్‌కు కమీషన్లు తీసుకునే బ్రోకర్‌ కాదని ‘ముచ్చట’కు అర్థమై ఉంటుంది.

Related Articles