బానిస బతుకెందుకు?

మాజీ ఉపముఖ్యమంత్రులు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్‌ గడీలో బానిసల కంటే హీనంగా బతుకుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. దళితులైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊడబీకి దళితులను కేసీఆర్‌ అవమానించారన్నారు. వందల మంది ముందు వరంగల్‌ సభలో అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్‌ అవమానించారన్నారు. దళితులను అవమానించిన కేసీఆర్‌కు దళితుల గూటం దెబ్బ చూపించాలని పిలుపునిచ్చారు. ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రలో భాగంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్యపై ఆయన ఫైర్‌ అయ్యారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో బతికిన కడియం శ్రీహరి.. దొర పార్టీలో చేరగానే బానిసలా మారిపోయారని, చచ్చిన పాములా బతుకున్నారని అన్నారు. అప్పుట్లో ఉన్న ఆత్మగౌరవం ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ‘దొర దగ్గర బానిసలా బతుకున్నావు.. శ్రీహరన్న ఇంత అవమానం అవసరమా.. దొర దగ్గర వెన్నెముక ఒంగిపోయిందా.. దొర ముందు ఎందుకు సాగిల పడుతున్నవ్‌, మాదిగ పౌరుషం చచ్చిపోయిందా.. పదవుల కోసం తాకట్టు పెట్టినవా.. ఆలోచన చెయ్‌’ అని కడియం శ్రీహరిని ఉద్దేశించి అన్నారు. రాజకీయ భిక్ష పెట్టి న కాంగ్రె్‌సను వదిలి దొర గడీలో చేరారని తాటికొండ రాజయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొర గడీల్లో గాడిద కంటే హీనంగా రాజయ్య బతుకుతున్నారని మండిపడ్డారు. రాజయ్యను ఎందుకు బర్తరఫ్‌ చేయాల్సి వచ్చిందో, ఆయన చేసిన అవినీతి ఏంటో ఎందుకు బయట పెట్టలేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్‌ తన మంత్రివర్గంలో ఒక్క దళితుడికి కూడా స్థానం ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

Related Articles