మాకు ఒక్క అవకాశం ఇవ్వండి!..

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకొంటున్న కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చి.. జనం మోసపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సమష్టిగా 10 నెలలు కష్టపడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. 10 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీ దుఃఖం 10 నెలల్లో పోనుందని అన్నారు. ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ పాదయాత్రలో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. పాలకుర్తిలోని రాజీవ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ తెచ్చిన అని చెప్పుకుంటున్న కేసీఆర్‌కు రెండు సార్లు అవకాశం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. దళితులకు మూడు ఎకరాలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌, రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ విద్య, ఆరోగ్యశ్రీ, పాత్రికేయులకు ఆరోగ్యభద్రతా కార్డులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థుల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. కులాలు, మతాలకు అతీతంగా పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. 2009లో ఏపీ నేతలు అడ్డం పడడంతో తెలంగాణ ప్రకటన వాయిదా పడిందని, దీంతో కేసీఆర్‌కు చేతకాక, కాడి కింద పడేసి జానారెడ్డి వద్దకు వెళ్లాడని గుర్తుచేశారు. అప్పుడు అన్ని పార్టీలను పిలిచి కోదండరామ్‌ చైర్మన్‌గా పొలిటికల్‌ జేఏసీని జానారెడ్డి ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్రంలో, ఏపీలో, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా సోనియా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. జేఏసీ పెట్టింది, జెండాలు కట్టింది, ప్రాణాలు ఇచ్చింది తామైతే ప్రస్తుతం తెలంగాణను ఎవడు ఏలుతున్నడో కదా?.. అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related Articles