కూకట్‌పల్లి బస్సుల దగ్ధం కేసులో పురోగతి

హైదరాబాద్ కూకట్‌పల్లి బస్సుల దగ్ధం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 12న అర్థరాత్రి కూకట్‌పల్లిలోని పార్కింగ్ ప్రదేశంలో మంటలు చెలరేగడంతో భారతి ట్రావెల్స్‌కి చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపై ట్రావెల్స్ నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదం కారణంగా ఈ ఘటన జరిగిందా? లేదా ఎవరైనా కావాలని నిప్పంటించారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. బస్సు డ్రైవర్ పసుపులేటి వీరబాబు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. డ్యూటీకి రాలేదనే కోపంతో యజమాని కృష్ణారెడ్డి తన సోదరుడి కుమారుడైన యశ్వంత్ రెడ్డితో కలిసి డ్రైవర్ వీరబాబును గదిలో బంధించారు. అనంతరం ఇంజిన్ బెల్టు, కొబ్బరి మట్టలతో చితకబాదారు. వీరబాబు బంధువు ఇంటికి వెళ్లి మరీ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో యజమానిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో గ్యారేజీలో ఉన్న బస్సులకు వీరబాబు నిప్పు పెట్టాడు. అర్థరాత్రి ఎవరూ లేని సమయంలో ఒక బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించగా.. మిగతా బస్సులకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మూడు బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యజమాని, సిబ్బందిని ప్రశ్నించారు. దీంతో తానే బస్సులకు నిప్పు పెట్టినట్లు వీరబాబు చెప్పడంతో.. అతడిని అరెస్ట్ చేశారు.

Related Articles