వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న పీజీ వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కేఎంసీలో పీజీ (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతోంది. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్(ఓటీ)లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఏఆర్సీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే ఆనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. మోతాదుకు మించి.. అదీ నేరుగా ఆనస్థీషియా తీసుకోవడం వల్ల ఆమె మెదడు, గుండె, కాలేయం దెబ్బతినడంతో పరిస్థితి విషమించినట్టుగా వైద్యులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్లను సెలైన్ ద్వారా కాకుండా ఆమె నేరుగా తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. కాగా పీజీ ద్వితీయ సంవత్సరం(అనస్థీషియా) చదువుతున్న ఆసిఫ్ ఆనే విద్యార్థి వేధింపులు తట్టుకోలేకనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. కాలేజీలో ఆసిఫ్ వేధింపులకు గురిచేస్తున్నాడని ప్రీతి తనతో వాపోయిందని ఆమె తండ్రి తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లా నని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సీనియర్ పీజీ విద్యార్థిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Related Articles
ర్యాగింగ్ చేస్తే మెడికల్ సీటు రద్దు?
- February 28, 2023
విజయవాడలో వైద్య విద్యార్ధి ఆత్మహత్య
- February 26, 2023
అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం
- February 23, 2023
లంచం ఇవ్వలేను.. కనికరించండి!
- February 18, 2023
వరంగల్‌లో మరో కొత్త సచివాలయం
- February 15, 2023